ఆషాడమాసం: అత్తవారింట్లో కొత్తకోడలు ఉండకూడదా?

     



ఆషాడ మాసం.. ఆషాడ మంత్, ఆది మాసం అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల. పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. అవసరమైతే మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ, భజంత్రీలు మోగించరు. అలాగే ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది.

వధూవరుల విరహం.. 
ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒక ఇంటిలో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకు వెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటారు. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు.   

కొత్త కోడలు పుట్టింటికి... 
ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి.  పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు.  అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే.    

ఎందుకిలా..
ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది. మారుతున్న వాతావరణంలో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం. కొత్త జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న వారు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు. ఈ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని  మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి.


ఆధునిక టెక్నాలజి కారణంగా సెల్‌ఫోన్‌లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసపు ఎడబాటు ముగుస్తుంది. అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు  విరహం, బాధ ఉండదు. వివాహమైన నెలరోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు.  

చాతుర్మాస దీక్షలు చేపడతారు.. 
ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని విశ్వసిస్తారు. నిజానికి  పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. వైష్ణవులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మఠాధిపతులు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్ష వహిస్తారు.  
– విజయ్‌భట్టర్, అర్చక సంఘం నాయకుడు, కడప 

ఎన్నో ప్రత్యేకతలు.. 
ఆషాఢ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్తాకోడళ్లు ఈ మాసంలో ఒకే ఇంటిలో ఉండకూడదని భావిస్తారు. నిజానికి ఈ నమ్మకం వెనుక ప్రకృతి ఆధారిత సంప్రదాయం ఉంది. దాదాపు అన్ని పండుగల వెనుక ప్రకృతి పరమైన లేదా ఆధ్యాతి్మక, పురాణ పరమైన విశ్వాసాలు ఉంటాయి.

– హరిభూషణరావు, లైబ్రేరియన్, కడప    

ref : sakshi






Which Rules We Follow in Ashada Masam | Dharma sandehalu - Episode 462_Part 2


Post a Comment

0 Comments