కుంభకర్ణుడు నిద్రలో ఎందుకుంటాడో తెలుసా?
ఆరు మాసాలకు ఒకసారి మాత్రమే కుంభకర్ణుడు మేల్కొంటాడనే విషయం మాత్రమే మనకు తెలుసు. కానీ రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. రావణుడి సోదరుల్లో ఒకరైన కుంభకర్ణుడు ఆరు మాసాలకు ఒకసారి నిద్ర మేల్కొంటాడు. ఆ రోజంతా తిని మళ్లీ నిద్రపోతాడు. అసలు నిరంతరం నిద్రలో ఉండానికి కారణం ఏంటనే విషయం ఎవరికైనా తెలుసా?. రామాయణంలోని ఉత్తర కాండలో దీని గురించి పేర్కొన్నారు. రాక్షస సోదరులై రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ అధ్యాయంలో తెలియజేశారు.
దైవానుగ్రహం కోసం తండ్రి విశ్రావసుడి ఆఙ్ఞతో ముగ్గురు సోదరులైన రావణ, విభీషణ, కుంభకర్ణాదులు తపస్సు ప్రారంభించారు. అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలను కోరుకోమన్నాడు. ముందు రావణుడిని వరం కోరుకోమని బ్రహ్మ అడిగాడు. తనకు అమరత్వాన్ని ప్రసాదించాలని రావణుడు కోరితే బ్రహ్మ దానికి తిరస్కరించాడు. అయితే పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవతలు వల్ల మాత్రం మరణం ఉండదని వరమిచ్చాడు.
విభీషుణుడు తాను ఎప్పుడూ నీతి పాటిస్తూ ఉండేలా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. దీనికి సమ్మతించిన బ్రహ్మ అతడు కోరుకున్న వరాన్నే ప్రసాదించాడు. కుంభకర్ణుడి దగ్గరకు బ్రహ్మ వచ్చేసరికి దేవతలు అడ్డుపడ్డారు. అతడికి ఎలాంటి వరం ప్రసాదించవద్దని పేర్కొన్నారు. ఎందుకంటే రావణ సోదరుల్లో ఇతడు చాలా బలవంతుడు. తృప్తిపరచని ఆకలితో ఇతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సలహా ఇచ్చారు. దీంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని మభ్యపెట్టి వరం అడగకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకు జ్ఞానం, తెలివితేటలకు మూలమైన తన భార్య సరస్వతి దేవి సహాయాన్ని బ్రహ్మ అర్థించాడు. కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతడి నాలుకను నియంత్రించాలని కోరాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసనం వరంగా కోరుకోవాలని పొరపాటున కుంభకర్ణుడు నిద్రాసనం అని అన్నాడు. దీనికి వెంటనే బ్రహ్మ తధాస్తు అని వరం ఇచ్చాడు. వెంటనే రావణుడు కలుగజేసుకుని నిరంతరం కుంభకర్ణుడు నిద్రలో ఉండటం సరికాదు, ఒక నిర్ణీత సమయం ఉండాలని, తర్వాత మేల్కొనేలా సడలించమన్నాడు. అతడు ఆరు మాసాలు నిద్రలో ఉండి ఒక రోజు మేల్కొంటాడు. ఆ రోజు మాత్రం భూమి మీద సంచరించి మానవులను ఆహారంగా స్వీకరిస్తాడని బ్రహ్మ వరం ప్రసాదించాడు.
రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు నిద్రపోయిన కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రావణుడు మేల్కొలిపినట్లు రామాయణంలోని యద్ధ కాండలో వివరించారు. మోక్షం పొందడానికే రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు బయలుదేరినట్లు తులసీదాస్ రచించిన రామచరితమానస్ తెలియజేస్తుంది. రాముడు శ్రీమహావిష్ణువు అవతారమని అతడికి ముందే తెలుసు. అందుకే సీతను అపహరించినందుకు రావణుడిని వ్యతిరేకించాడు కూడా.
0 Comments